‘కాపు గర్జన’ హింస గర్జనగా మారి ప్రభుత్వాన్ని డిఫెన్సులో పడేసింది.కాపు గర్జన పేరుతో తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు, పోలీసు స్టేషన్లు తగులబెట్టిన
సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు ఉద్యమ రంగంలోకి దిగబోతున్నాయి. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే సహించేది లేదని ప్రభుత్వం మెడలు వంచైనా రిజర్వేషన్లను అడ్డుకుంటామని బీసీ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. కాపులకు బీసీల హోదా వ్యవహారం ఏపీలో బీసీలను ఒక్కతాటిపైకి తెచ్చేలా కనిపిస్తోంది. కాపులకు బీసీ హోదా ఇస్తే రోడ్లపైకొచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికోసం కాకినాడలో భారీ బహి రంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కాపు నేతలకు కౌంటరుగా బీసీ గర్జన నిర్వహించేందుకు బీసీ సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాపులు ప్రభుత్వాన్ని బెదిరించేందుకే తునిలో ఘర్షణలు సృష్టించారని భావిస్తున్న బీసీలు ఆ విధంగా ఒకవేళ ప్రభుత్వం బెదిరింపులకు తలొగ్గితే తాము కూడా జిల్లాకో సభ నిర్వహించి రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చే వ్యవహారాన్ని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని కొన్ని పట్టణాల్లో పర్యటించిన కృష్ణయ్య ప్రాణాలొడ్డయినా కాపు రిజర్వేషన్లను అడ్డుకుంటామని అవసరమైతే బీసీలంతా రోడ్లపై కొచ్చి కూర్చుంటామని హెచ్చరిస్తున్నారు.
కాపులను బీసీల్లో చేర్చితే సర్పంచ్ – ఎంపీటీసీ -జడ్పీటీసీ – కౌన్సిలర్ – కార్పొరేటర్ ఎన్నికలలో మొత్తం రిజర్వేషన్లు కాపులే కొట్టేస్తారని బీసీ సంఘాలు అంటున్నాయి. ఓబీసీ కోటాలోనూ వారి డామినేషన్ పెరిగిపోతుందని అంటున్నారు. బీసీలను దూరం చేసుకుంటే టీడీపీకి పుట్టగతులు ఉండవని.. టీడీపీకి కాపులు కావాలా? బీసీలు కావాలో చంద్రబాబు చెప్పాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది.
No comments:
Post a Comment