చలసాని వెంకటరత్నం హత్య జరిగినప్పుడు కానీ వంగవీటి రాధా హత్య జరిగినప్పుడు కానీ, దేవినేని గాంధీ, మురళి హత్యలు జరిగినప్పుడు ప్రశాంతంగానే ఉన్న బెజవాడ
వంగవీటి రంగా హత్యతో భగ్గుమంది.. కాంగ్రెస్ నాయకుల పథక రచన కేవలం ఇద్దరు వ్యక్తుల (రంగా, నెహ్రూ) మధ్య పాత కక్షల కారణంగా జరిగిన గొడవలకు కులం రంగు పులమటంతో విజయవాడ నగరంతో పాటు, కోస్తా జిల్లాలలో కూడా కమ్మ, కాపు కులాల మధ్య చిచ్చు రేగింది. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న కాపుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీ రంగా హత్య తర్వాత జరిగిన 1989 ఎన్నికల్లో విజయం సాధించింది.
కాపు, కమ్మ మధ్య చిచ్చుపెట్టే అవసరం ఎవరికి..!
కాంగ్రెస్ పార్టీ నాయకుల రాక్షస రాజకీయ క్రీడలో బలైపోయిన కమ్మ, కాపు కులాల మధ్య వైరుధ్యం ఆ తరువాత రెండు దశాబ్దాలపాటు కొనసాగింది. ఆ రెండు కులాల మధ్య కుల విద్వేషాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన కాపులను ఏదో విధంగా రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న కోస్తా జిల్లాల్లో కులాల కుంపట్లు రగిలించి, విధ్వంసకాండ సృష్టించి తన పబ్బం గడుపుకోటానికి కొందరు కుట్రపన్నారు. అసలే కష్టాల్లో ఉన్నాం..ఎవ్వరూ పట్టించుకునే దిక్కు లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం దక్కేలా లేదు. ఈ టైంలో ఏదోలా కాపు వర్సెస్ కమ్మ మధ్య విద్వేషాలు రెచ్చగొడితే కాని వాళ్లకు నిద్ర పట్టేలా లేదు. ఎన్నికల హామీలో భాగంగా కాపుల కోసం కార్పోరేషన్ ఏర్పాటుచేసి, బిసిల్లో చేర్చటానికి కమిషన్ నియమించిన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కొంతమంది కాపు నాయకులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయంచటంలో ఈ కుట్ర వెనక ఉన్న నాయకులు కొంత వరకు సక్సెస్ అయ్యారు.
అధికారం కోసం జగన్ ఎత్తుగడా..!
ఇక కాపు గర్జన వెనక జగన్ ఉన్నాడని వస్తున్న వార్తలను బట్టి చూస్తే దీని వెనక జగన్ పెద్ద ప్లానే వేసినట్టు స్పష్టమవుతోంది. జగన్ కూడా తన పార్టీ ఎన్నిక మానిఫెస్టోలో తానూ అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేర్చటానికి కమిషన్ వేస్తానని చెప్పాడే తప్ప జీవో తో బిసిల్లో చేరుస్తానని చెప్పలేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ జీవో జారీ చేసి, ఆ తరువాత ఆ జీవోను కోర్టులు కొట్టివేస్తే కాపులను బిసిల్లో చేర్చే విషయంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని ప్రచారం చెయ్యవచ్చు అనేది జగన్ ఆలొచన… తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాపులను బీసీల్లో చేర్చటానికి ఎందుకు ప్రయత్నించలేదో జగన్ చెప్పడం లేదు. ఇదే విషయాన్ని సోమవారం చంద్రబాబు తన ప్రెస్‌మీట్లో ప్రస్తావించినప్పుడు కూడా జగన్ వద్ద నుంచి సరైన సమాధానం లేదు. గత ఎన్నికల్లో పవన్ వల్ల అయినా, లేదా చంద్రబాబును నమ్మి అయినా కాపులు టీడీపీకి సపోర్ట్‌గా నిలిచారు. అందుకే ఆ సామాజికవర్గం బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో వైకాపా అడ్రస్ లేదు.
టీడీపీ కంటే ఎక్కువ టిక్కెట్లు ఇచ్చినా జగన్‌ను నమ్మని కాపులు:
గత ఎన్నికల్లో కాపులు జగన్మోహన్‌రెడ్డిని అస్సలు నమ్మలేదన్న విషయం స్పష్టమవుతోంది. ఉదాహరణకు గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం బలంగా ఉండే ఉభయగోదావరి జిల్లాలో జగన్ 6 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు కాపులకు కేటాయించాడు. అయితే ఈ జిల్లాలో టీడీపీ అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది. చంద్రబాబు జగన్‌తో పోల్చుకుంటే కాపులకు అన్ని స్థానాలు ఇవ్వకపోయినా కాపులందరూ కూడా టీడీపీకే ఓట్లు వేసి మరీ గెలిపించారు. దీనిని బట్టి జగన్‌ను నమ్మేందుకు కాపులు ఎప్పటకీ సిద్ధంగా లేరు అన్నది ఇక్కడ తేటతెల్లమైంది.
వంగవీటి క్యాస్ట్ ఎఫెక్ట్‌తోనే దెబ్బతిన్నాడా…!
2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆ తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం ఏమిటి? 2004 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పవనాల్లో రాధాకృష్ణ గెలిచాడు. అప్పటకీ రాధా వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. రాధాను పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న కాపులందరూ విజయవాడ చేరుకుని మరీ ఆయనకు మద్దతుగా నిలిచారు. తదనంతర పరిణామాల్లో రాజశేఖర రెడ్డి తన బద్ధ శత్రువు నెహ్రూ ను దగ్గరకు తీయటం నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేసి రంగా అనుంగు శిష్యుడు ‘మల్లాది విష్ణు’ చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాత రాధా మళ్లీ ప్రజారాజ్యంకు గుడ్ బై చెప్పి 2014 ఎన్నికల్లో వైకాపా తరుపున విజయవాడ తూర్పు నుండి పోటీ చేసి రెండో సారి పరాజయం పాలయ్యాడు.. రాధాకృష్ణకు అన్ని కులాల్లో అభిమానులున్నారు కానీ కాపులు అతనికి వేసిన కులం రంగు అతని విజయావకాశాలను దెబ్బతీసింది అనేది ఒప్పుకోవలసిన నిజం. అదే అతని తండ్రికి మాత్రం అన్ని కులాల్లోను అభిమానులుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
ముద్రగడకు చిత్తశుద్ధి ఉందా..!
అదే విధంగా గతంలో కాపు ఉద్యమాన్ని తలకెత్తుకున్న ముద్రగడ పద్మనాభం కాపు జాతి కోసం, కాపుల అభ్యున్నతి కోసం పోరాటం చేయడంలో ఎంత మాత్రం తప్పులేదు. అయితే ఒకసారి ముద్రగడ గతాన్ని చూస్తే ఇతనా కాపుల కోసం పోరాడుతున్నది అని షాక్ అవ్వకతప్పదు. 1994, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గాలిలో కూడా ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోవటానికి ఆయన తనకు తానుగా పులుముకున్న కులం రంగే అని రాజకీయ విశ్లేషకులు చెపుతారు. రంగా హత్యకు తెలుగుదేశం పార్టీనే కారణమని చెప్పి ఉద్యమం చేసిన ఈ నాయకుడు మరి 1999 లో అదే తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి కాకినాడ పార్లమెంటుకు ఎన్నికైన విషయాన్ని కూడా ఎవ్వరూ మర్చిపోలేదు. తమ స్వప్రయోజనాలకోసం పార్టీలు మార్చే ముద్రగడ పలు పార్టీలు మార్చి చివరకు 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన తరువాతే ఈయనకు కాపులు మళ్లీ గుర్తుకు వచ్చారా? అమాయక కాపు యువతను కాపులను రెచ్చగొట్టి.విద్వేషాలు, విధ్వంసాలు సృష్టిస్తే ఆయనకు ఏమి ప్రయోజనం, కాపు జాతి ప్రయోజనాలు దెబ్బతినటం తప్ప!
చిరుకు కులం దెబ్బే పడింది…
ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి కూడా కేవలం అతను మావాడంటూ మనం పూసిన కులం రంగే ‘చిరంజీవి’ కాపులకు బలమైన నియోజకవర్గం ‘పాలకొల్లు’ లో ఓడిపోవటం నూటికి నూరుపాళ్ళు కారణం అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపించాయి. కేవలం ఒక కులం వాళ్ళు ఓటు వేస్తేనే నాయకులు గెలవరు, ఒకే కులాన్ని నమ్ముకుంటే మిగిలిన కులాల వారు దూరమౌతారు అనేందుకు పై మూడు ఉదాహరణలు సరిపోతాయి. కులం వ్యక్తి గతం.. రాజకీయం కుల మతాలకు అతీతమైనది.
కులాన్ని తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునే రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దు… కులం వేరు రాజకీయం వేరు అనే విషయం గుర్తుంచుకుని అన్ని పార్టీలతో, అన్ని కులాల వారితో సామరస్యంగా ఉండి మన హక్కులు సాధించుకోవాలి. నిజం ఎప్పడూ చేదుగానే ఉంటుంది… జీర్ణించుకోవటం కష్టమే!
-శ్రీనివాస చక్రవర్తి కనకమేడల
No comments:
Post a Comment