'ఆయనతో ఖచ్చితంగా సినిమా చేస్తా'
ఆయనతో ఖచ్చితంగా సినిమా చేస్తా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్
రాజమండ్రి : మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు పిచ్చి అని, చిన్నప్పుడు ఆయన సినిమాలకు జెండాలు కట్టేవాడినని, ‘ఛాలెంజ్’ సినిమా షూటింగ్ దూరం నుంచి చూశానని చెప్పారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయనతో 150వ చిత్రం తీసే అవకాశం
రావడం తన అదృష్టమని, అయితే తాను చెప్పిన కథ ఆయనకు నచ్చలేదని అన్నారు. ఎన్నో సినిమా అన్నది ఎలా ఉన్నా.. ఆయనతో సినిమా చేయడం ఖాయమని చెప్పారు. ‘లోఫర్’ సినిమా విజయయాత్రకు బుధవారం రాజమండ్రి వచ్చిన స్థానిక ఆనంద్ రీజెన్సీలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సాక్షి: మీరు పుట్టింది?
పూరి : వైజాగ్. ఆ ప్రాంతమన్నా, అక్కడి సముద్రమన్నా నాకు చాలా ఇష్టం. నేను సినీరంగానికి ఎదిగేందుకు నా ఊరు నాకెంతో సహాయం చేసింది. పుట్టిన ఊరుకి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. ‘ఇట్లు శ్రావణిసుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి’ వంటి చిత్రాల షూటింగ్ అక్కడే జరిగింది. ‘టెంపర్’ సినిమా కథ వైజాగ్ కోసమే రాసినా హుదూద్ తుపాను కారణంగా అక్కడ తీయలేకపోయూను.
సాక్షి: ఏం చదువుకున్నారు?
పూరి : డిగ్రీ చదువుకున్నా సిని మా రంగంపై మక్కువతో ఆ సర్టిఫికెట్లన్నీ చింపేశా. ప్రేక్షకులు నాకు ఇచ్చిన ఈ గుర్తింపు మర్చిపోలేనిది. వారి కోసం మరిన్ని మంచి సినిమాలు తీస్తా
సాక్షి: ఇటీవల మహిళలకు ప్రాధాన్యమున్న కథలనే ఎంచుకుంటున్నారు?
పూరి : కథలో మహిళలను టచ్ చేస్తే బాగుం టుంది. ‘జ్యోతిలక్ష్మీ, టెంపర్, లోఫర్’ ఇవన్నీ మహిళా కథాంశాలతో ముడిపడ్డవే. వాటికి మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అయినా ఆ టైపులోనే సినిమాలు తీయాలని లేదు. వైవిధ్యభరితమైన అంశాల మేళవింపుతో మరిన్ని చిత్రాలు తీస్తా. నేను నిర్మాతగా కొత్తతారలతో చిత్రం ప్రారంభించాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా. ఎన్నుకున్న కథ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతోనే సినిమా నిర్మాణం జరుగుతుంది. జయాపజయాలు ఎవ్వరూ చెప్పలేరు.
No comments:
Post a Comment