తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు గర్జన జరిగిన ఘటనలపై టీడీపీ నేతలు పలు అనుమానాలు
వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంట్లో కూర్చుని ఉన్న ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా కాపు ఉద్యమాన్ని ఎత్తుకోవడం వెనక రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వంపై కుట్ర రూపంలోనే ఈ ఘటన జరుగుతోందని ఆక్షేపించారు. ఏపీ డిప్యూడీ సీఎంలు అయిన నిమ్మకాయల చినరాజప్ప, కేఈ.కృష్ణమూర్తి ఈ విధ్వసంపై వేర్వేరు చోట్ల స్పందించారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాపుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని సహించలేకే వైకాపా నేతలు హింసను ప్రేరేపించారని ఆరోపించారు. కాపులు సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాపు గర్జనలో జరుగుతున్న విధ్వంసం వెనక వైకాపా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మరో డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి సైతం రాజకీయ సమస్యలు సృష్టించేందుకే ఆందోళనలు చేపడుతున్నారని విమర్శించారు. తుని ఘటనను చూస్తుంటే…ప్రజాదరణ లేని రాజకీయ నిరుద్యోగులే ఆందోళన చేస్తున్నంట్లుందని అన్నారు. బీసీల్లో చేర్చాలని చాలా కులాలు అడుగుతున్నాయని…. కాపులను బీసీల్లో చేర్చడంపై కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇక మరో మంత్రి, కాపు సామాజికవర్గానికే చెందిన గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తునిలో జరిగిన హింసా కాండకు కాంగ్రెస్, వైకాపాలదే బాధ్యత అని చెప్పారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తునిలో జరిగిన హింసాకాండ ఉదంతంలో జగన్ ప్రమేయం ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేకనే జగన్ వెనకుండి కథ నడిపాడని అన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా తల్లి,పిల్ల కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగంగానే తునిలో విధ్వంసం జరుగుతోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం వైకాపా చేస్తున్న కుట్రలను కాపులందరూ గుర్తించాలని కోరారు.
No comments:
Post a Comment