రాజకీయాల్లో ఆయన అందరికన్నా సీనియర్…. అపార రాజకీయ అనుభవం
ఆయన సొంతం.. పైగా ముఖ్యమంత్రి.. దేశ రాజకీయాలను శాసించిన నేత.. మరి ఇంకొకరు గాన గంధర్వుడు.. తన గాత్రంతో ఎన్నో పాటలతో ప్రాణప్రతిష్ఠ చేసిన గాయకుడు.. భారత దేశం గర్వించదగ్గ.. తెలుగు ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చెప్పుకోగల గాయకుడు.. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదివారు. అందులోనూ.. ఆ గానగంధర్వుడు ఆ సీఎం కన్నా సీనియర్ అట. ఇలాంటి మాట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుటే చెప్పటం.. దానికి ఆయన ముఖంలో చిరు దరహాసం కనిపించటం లాంటివి సాధ్యమేనా? ఇంతకీ చంద్రబాబు తన కంటే చాలా జూనియర్ అన్నదెవరు? బాబు ముఖంలో నవ్వులు పూయించిన ఆ ప్రముఖుడు ఎవరు?
ఇంకెవరు.. గాన గంధర్వుడు.. తెలుగు ప్రజలు సగర్వంగా చెప్పుకోగలిగే గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. విశాఖలోని ఆర్కే బీచ్ లో విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలును ”స్వర కళ సామ్రాట్“ బిరుదుతో చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరం ఒకే కాలేజీలో చదివామన్న విషయాన్ని చెప్పారు. తామిద్దరం ఎస్వీఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నామని.. చంద్రబాబు తనకంటే చాలా జూనియర్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు చాలామంచి మిత్రుడన్నారు.
ఈ సందర్భంగా బాలు కొన్ని రాజకీయ డైలాగులు కూడా పేల్చారు. ఐదేళ్లు పాలించాలని మెజార్టీ ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు.. ఆ ప్రభుత్వానికి శాయశక్తులా సహకరించాలే కానీ విమర్శించకూడదన్నారు. `మంచి పనులు చేస్తూ ప్రగతి వైపు పయనిస్తుంటే.. ఆ దారిని సుగమం చేయాలే తప్పించి.. అడ్డు పడకూడదు. ఒకవేళ అలా చేయటం చేతకాకపోతే.. పక్కకు తప్పుకొని చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి. లేదంటే ప్రగతి ఆగిపోతుంద`ని వ్యాఖ్యానించారు. ఏదేమైనా బాలు పరోక్షంగా చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నాడంటూ ఆకాశానికి ఎత్తేసినట్టు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది.
please share it..
No comments:
Post a Comment