Sunday, 27 December 2015

శుభం కార్డు చేతపట్టి...!

శుభం కార్డు చేతపట్టి...!

వెళ్లిపోతున్న ఏడాది ఎలా ఉన్నా కొత్త సంవత్సరంపై ఎన్నో ఆశలు. కొట్టిందల్లా సిక్సరే కావాలని.. పట్టిందల్లా ఉడుం పట్టు కావాలని.. మన రాకెట్లు దూసుకెళ్లాలని.. ఇలా సగటు క్రీడాభిమానికి ఎన్నెన్నో ఆకాంక్షలు. భారత క్రీడరంగానికి 2016 సంవత్సరం ఎంతో కీలకం! ఎందుకంటే ప్రపంచ క్రీడా సంబరం రియో ఒలింపిక్స్‌ జరిగేది ఈ ఏడాదిలోనే! టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇంకెన్నో ముఖ్యమైన టోర్నీలనూ కొత్త సంవత్సరంలో చూడొచ్చు. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఏళ్లుగా మనల్ని అలరిస్తూ.. మన ఆశలను, అంచనాలను మోస్తున్న దిగ్గజాలు ఈ 2016లోనే తమ కెరీర్లకు శుభం కార్డు వేయొచ్చు. మరి మనం ఇక ఎక్కువ కాలమేమీ చూడలేని ఆ క్రీడాకారులెవరో చూద్దామా!


2007 టీ20 ప్రపంచకప్‌ విజయంతో మహేంద్రసింగ్‌ ధోని పేరు మార్మోగిపోవడం.. ఆ తర్వాత కెప్టెన్‌గా ఈ ఝార్ఖండ్‌ డైనమైట్‌ ఎలా అత్యున్నత స్థాయికి ఎదిగాడో అభిమానులకు తెలిసిన విషయమే. 2015లో టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన మహి.. 2016 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. వన్డేలు టీ20లకు సారథిగా ఉన్న మహి... ఆ రెండు ఫార్మాట్లకు కూడా త్వరలోనే వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి. ఐతే సొంతగడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోని భారత్‌ను విజేతగా నిలబెట్టి ఘనంగా కెరీర్‌ ముగించవచ్చన్నది అంచనా. 2007లో ఎవరి అంచనాలకు అందకుండా ప్రపంచకప్‌ను అందించిన మహి.. ఈసారి సొంతగడ్డపై ఒత్తిడిలో జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరం. దీని కన్నా ముందు ధోనికి ఆస్ట్రేలియాలో వన్డే, టీ20 సిరీస్‌ రూపంలో మరో సవాల్‌ ఎదురు కానుంది. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆకట్టుకుంటే ప్రపంచకప్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగొచ్చు. 

No comments:

Post a Comment