Sunday 14 February 2016

జగన్‌కు డెడ్‌లైన్ నెల రోజులేనా..?

4501201047

వైకాపా అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డికి డెడ్‌లైన్‌ నెల రోజులే.. ? ఎందుకంటే త్వ‌ర‌లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జ‌రగ‌నున్నాయ‌నే వార్త‌లు వెలువడట‌మే ఇందుకు కార‌ణం. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన దాదాపు రెండేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌నున్న ఏపీలో కార్పొరేషన్ ఎన్నికలు వైకాపా స‌త్తాను చాటుకునేందు అవ‌కాశంగానే కాకుండా ఆ పార్టీ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను తేల్చే అంశంగా మార‌నున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఈ నెలాఖరులోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విశాఖపట్నం- భీమునిపట్నం మధ్య ఉన్న గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో ఉన్న కేసుల విషయంలో ఒక అంగీకారానికి రావడం ద్వారా ఎన్నికల నిర్వహణపై ఒక నిర్ణయానికి ప్ర‌భుత్వం రావాలని నిర్ణ‌యించింది. ఈ విష‌యంపై మంత్రి నారాయణ ఈ వారంలో విశాఖ‌కు రానున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
జీవీఎంసీ ఎన్నికలకు అడ్డంకిగా నిలిచిన ఐదు గ్రామాలు కె.నగరంపాలెం, కాపులుప్పడ, చేపలుప్పడ, నిడిగట్టు, జేవీ ఆగ్రహారం విలీసం సమస్యను సామరస్యంగా, సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ నియోజ‌క‌ర్గం నుంచి పోటీ చేసిన జ‌గ‌న్ త‌ల్లి వై.ఎస్. విజయమ్మ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇటీవ‌లి కాలంలో అధికార టీడీపీ దూకుడుగా వెళుతూ తెలుగుదేశం పార్టీలోకి వ‌చ్చేవారికి పెద్ద ఎత్తున ఆహ్వానం ప‌లుకుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్నది ఒక కారణమైతే, పార్టీ అధినేత తీరు మరో కారణంగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా రాజ‌కీయ క్రాస్‌రోడ్స్‌లో వైకాపా భ‌విష్య‌త్‌ను, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌ సమర్థతను కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని వైకాపా వర్గాలతో పాటు రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నావేస్తున్నాయి.

No comments:

Post a Comment