Sunday 14 February 2016

ఓటుకు నోటు కేసులో మ‌రో మ‌లుపు

804501201320

తెలంగాణ‌లో టీడీపీని మ‌రింత నిర్వీర్యం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పావులు క‌దుపుతోంది. కుదిరితే ప‌ద‌వులు ఎర‌చూపడం.. లేక‌పోతే పాత‌కేసులు తిర‌గతోడ‌తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యేని త‌మ వైపు ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇందుకోసం కొద్ది రోజులుగా తెర‌మ‌రుగైపోయిన `ఓటుకు నోటు` కేసును వినియోగించుకోవాల‌ని చూస్తోంది. తాజాగా ఈ కేసులో మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూస‌లేం ముత్తయ్య‌కు ఏసీబీ అధికారులు నోటీసులు పంపించ‌డంతో వ్య‌వ‌హారం మ‌ళ్లీ వివాదం రాజుకుంటోంది.
టీ ఏసీబీ అధికారులు జెరూస‌లెం ముత్త‌య్య ఇంటికి వెళ్లి ఓటుకు నోటు కేసులో విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. వారంలోగా విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. ఉప్ప‌ల్‌లోని ముత్త‌య్య ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన నేప‌థ్యంలో.. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలను త‌మ పార్టీలోకి ఆకర్షించుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కూడా పార్టీలోకి ఎలాగైనా ఆక‌ర్షించాల‌ని చూస్తోంది. అందుకు ఓటుకు నోటు కేసు ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తోంది. స్టీఫెన్సన్‌కు రేవంత్‌రెడ్డి అంద‌జేసిన రూ.50ల‌క్ష‌లను మాగంటి గోపీనాథ్ స‌మ‌కూర్చారని, ఈ క్ర‌మంలో ఆయ‌న అరెస్టు కూడా త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఈ అంశం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి ఈ కేసులో ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతాయో ఏమో!

No comments:

Post a Comment