Friday 29 January 2016

రివ్యూ: లచ్చిందేవికి ఓ లెక్కుంది

tt480450204

సినిమా: లచ్చిందేవికి ఓ లెక్కుంది
న‌టీన‌టులు: నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠి, అజయ్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ
సంగీతం: ఎంఎం.కీర‌వాణి
నిర్మాత‌లు: సాయిప్ర‌సాద్ కామినేని
ద‌ర్శ‌క‌త్వం: జ‌గ‌దీష్ త‌ల‌శిల‌
ర‌న్ టైం: 110 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 29 జ‌న‌వ‌రి, 2016
అందాల రాక్షసి తర్వాత లావణ్యా త్రిపాఠీ, నవీన్ చంద్ర మరోసారి జంటగా నటించిన లచ్చిందేవికి ఓ లెక్కుంది మూవీకి సినిమాకు ముందే మంచి హైప్ వ‌చ్చింది. అందాల రాక్ష‌సి లాంటి విభిన్న‌మైన సినిమా త‌ర్వాత వీరిద్ద‌రు న‌టించ‌డంతో పాటు టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన జగదీష్ తలశిల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు ఈ సినిమా ట్రైల‌ర్ల‌కు, టీజ‌ర్ల‌కు విశేష స్పంద‌న రావ‌డం..జ‌గ‌దీష్‌ను రాజ‌మౌళి ఆకాశానికి ఎత్తేయ‌డంతో ఈ సినిమా క్రేజ్‌ను పెంచేశాయి. ఈ క్రేజ్ మ‌ధ్య ప్రేక్ష‌కుల తీర్పు కోసం ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది ఎలా ఉందో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.
స్టోరీ ఎలా ఉందంటే…
బ్యాంకులో కస్టమర్ సర్వీస్ డెస్క్‌లో ప‌ని చేస్తుంటాడు న‌వీన్‌(న‌వీన్‌చంద్). అయితే అదే బ్యాంకులో ప‌నిచేస్తుంటుంది దేవి(లావ‌ణ్య త్రిపాఠి). వీరిద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి అస్స‌లు ప‌డ‌దు. నవీన్‌ని అడ్డంపెట్టుకుని ఆ బ్యాంకులో బినామీ పేర్లతోనో లేక నామినీలు లేకుండానో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసి చనిపోయిన వ్యక్తుల అన్‌క్లెయిమ్డ్ ఎకౌంట్స్‌లోని డబ్బుల్ని దోచుకునేందుకు ప్లాన్ చేస్తాడు మహేష్(అజయ్). ఆ అకౌంట్ల గురించి పూర్తిగా తెలిసిన దేవి నుంచి వివరాలు తెలుసుకోవడానికి ఆమె మీద ప్రేమ నటిస్తాడు నవీన్. ఆ అకౌంట్ల డీటైల్స్ తెలుసుకుని వీళ్లు డబ్బులు కాజేసే సమయానికి బ్యాంకు మేనేజర్ సోమయాజులు (జయప్రకాష్ రెడ్డి) రంగంలోకి దిగుతాడు. అప్పుడేమైంది? ఇందులో బ్యాంకు మేనేజర్(జయప్రకాశ్ రెడ్డి) పాత్ర వుందా ? బ్యాంకుని దోచుకునే మహేష్ బ్యాచ్ సక్సెస్ అయిందా లేదా ? ప్రియురాలు దేవిని కాపాడటానికి నవీన్ వేసిన ఎత్తుగడలు ఏంటి ? అతడు దేవి ప్రేమని జయస్తాడా లేదా ? ఇంత‌కు చివ‌రిగా స్టోరీ ఏమైంది అన్న‌ది తెర‌మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేష‌ణ‌:
బ్యాంకు ఉద్యోగిగా, దేవిని దేవతలా ప్రేమించే ప్రియుడిగా, ఏదో ఓ మార్గంలో డబ్బు సంపాదించాలని తపనపడే ఆవారాగా నవీన్ చంద్ర న‌టించాడు. దేవిగా, ఉమాదేవి ఆత్మగా, అప్పుడప్పుడు ఆవహించిన ఆంకాలమ్మగా లావణ్య యాక్ట్ చేసింది. డైరెక్టర్ జగదీష్ తలశిల ప్లాన్ చేసిన ట్విస్టులు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా దోచుకునేందుకు స్లోగా స్కెచ్ వేయడంతోనే గడిపేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్‌లో ఆ డ్రామాలో కొంత వేగం పెంచేందుకు ట్రై చేశాడు. కీరవాణి అందించిన ట్యూన్స్‌లో ”క్రేజే క్రేజ్” సాంగ్ బాగుంది. ఆరంభంలో వచ్చిన క్లబ్ సాంగ్ ”మాస్క్ వేసెయ్.. ”చిత్రీకరణలో నిజంగానే అక్కడక్కడా మాస్కులేసి ఓ కొత్త ప్రయోగం చేశారు.
ఆరంభం నుంచి సిల్లీ సిల్లీ సన్నివేశాలతో సాగే సినిమా.. ఇంటర్వెల్ ముందు మాత్రం కొంచెం ఆసక్తి రేపుతుంది. బ్యాంకులో జరుగుతున్న మోసాన్ని మేనేజర్ పసిగట్టి దాన్ని రివీల్ చేసే సీన్ సినిమాకు కీలకం. దీంతో సెకండాఫ్‌లో ఏదో ఉంటుంద‌ని ఆశించిన ప్రేక్ష‌కుడు పూర్తిగా నిరాశ‌ప‌డ‌తాడు. సెకండాఫ్ లో పేలవమైన ఫాంటసీ పాయింట్ చుట్టూ కథనాన్ని నడిపించి.. మళ్లీ సినిమా గాడి తప్పించేశాడు. చికాకు పుట్టించే దయ్యం వేషాలు పాటలతో సినిమా గ్రాఫ్ బాగా పడిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చే ట్విస్టులు కానీ.. క్లైమాక్స్ లో హంగామా కానీ సినిమాను నిలబెట్టలేకపోయాయి. సినిమా మొత్తం ట్విస్టుల‌తో ఉన్నా అవి ఎక్క‌డా ఆస‌క్తి క్రియేట్ చేయ‌లేదు. కోట్ల రూపాయ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంలో క‌థ‌నం న‌డిపేట‌ప్పుడు ప్ర‌తి వ్యవహారం చాలా సిల్లీగా క‌న‌ప‌డుతుంది.
న‌టీన‌టుల పెర్పామెన్స్‌:
న‌వీన్‌చంద్ర చాలా టాలెంటెడ్ న‌టుడే అయినా ఈ సినిమాలో అత‌డి పాత్ర సినిమాకు ఎందుకూ హెల్ఫ్ కాకుండా పోయింది. సెకండాఫ్‌లో అయితే హీరో క్యారెక్ట‌ర్ మ‌రీ డ‌మ్మీగా మారిపోయింది. సెకండాఫ్‌లో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు ఫాంట‌సీ యాంగిల్ జోడించి హైలెట్ చేద్దామ‌నుకుంటే అది ఫెయిల్ అయ్యింది. ఆ స‌న్నివేశాల‌న్ని చాలా బోర్ కొట్టించేశాయి. వరుసగా రెండు హిట్స్ అందుకున్న లావణ్యకి ఈ సినిమా మళ్ళీ ఫెయిల్యూర్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే.. కథ అంతా ఈ పాత్ర చుట్టూ తిరుగుతుంది కానీ తనకి మాత్రం సరైన పాత్ర లేదు. ఇక ఉన్నంత‌లో జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి క్యారెక్ట‌ర్ మాత్ర‌మే కాస్తో కూస్తో న‌వ్వులు తెప్పించింది. సినిమాలో ఏ ఒక్క క్యారెక్ట‌ర్‌ను కూడా డైరెక్ట‌ర్ స‌రిగా రాసుకోలేదు. అజ‌య్ కూడా చేసిందేమి లేదు. సంపూర్ణేష్‌ బాబు, బ్రహ్మాజీ, భద్రం, నరసరాజ్, భాను శ్రీ ఇలా ఎవ్వరూ మెప్పించేలేకపోయారు.
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
ఈ సినిమాకు సాంకేతికంగా హెల్ఫ్ అయిన విభాలు ఏంటంటే వాటిలో ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ. చాలా త‌క్కువ లొకేష‌న్ల‌లో ఈ సినిమా షూట్ చేసినా బెట‌ర్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఇక కీర‌వాణి త‌న స్టైల్‌కు భిన్నంగా ట్యూన్స్ బాగున్నా సినిమాలో సెట్ అవ్వ‌లేదు. ద్వితీయార్ధంలో వచ్చే రెండు దయ్యం పాటలూ ప్రేక్షకుల్ని మరో రకంగా భయపెడతాయి. ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే పాట బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఇక ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు సినిమాను చాలా త‌క్కువ‌గా కుదించి కేవ‌లం 110 నిమిషాల పాటు ఉండేలా ట్రిమ్ చేసినా సినిమా చాలా ఘోరంగా..భారంగా ముందుకు క‌దులుతుంది.
సినిమా నిర్మాణ విలువ‌లు నాసిర‌కంగా ఉన్నాయి. త‌క్కువ బ‌డ్జెట్లో సినిమాను చుట్టేశారు. ఇక సినిమా డైరెక్ట‌ర్ జ‌గ‌దీష్ త‌ల‌శిల విష‌యానికి వ‌స్తే క్రైం కామెడీ జాన‌ర్‌లో ఎంచుకున్న లైన్ బాగున్నా దానిని డ‌వ‌ల‌ప్ చేసిన విధానం చాలా దారుణాతి దారుణంగా ఉంది. సినిమా న‌రేష‌న్ పొడ‌పాము కంటే భారంగా క‌దులుతుంది. క‌థ‌నం చెత్త‌గా ఉంటే డైరెక్ట‌ర్‌గా ఒక్క సీన్ కూడా మంచిగా ఉంద‌ని చెప్పుకోవ‌డానికి లేదు. ఓవ‌రాల్‌గా సినిమాను ప్లాప్ చేసిన ఘ‌న‌త జ‌గ‌దీష్‌కే ద‌క్కుతుంది. ఇక డైలాగ్స్ ఒక్క‌ట‌న్నా గుర్తుండేలా లేవు.
ఫ్ల‌స్ పాయింట్స్‌:
– మెయిన్ స్టోరీ లైన్‌
– 110 నిమిషాల ర‌న్ టైం (ప్రేక్ష‌కులు త్వ‌ర‌గా ఈ త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు)
మైన‌స్ పాయింట్స్‌:
– పైన చెప్పిన మెయిన్ స్టోరీ లైన్, ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, అక్క‌డ‌క్క‌డా మెరిసిన కీర‌వాణి సంగీతం మిన‌హా మిగిలిన‌వ‌న్నీ
ఫైన‌ల్‌గా…..
అందాల రాక్షసి పెయిర్ అయిన లావణ్య త్రిపాటి – నవీన్ చంద్రల కాంబినేషన్ లో వచ్చిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా వాళ్ల కేరీర్‌లో మ‌ర‌పురాని ప్లాప్ మూవీగా మిగిలిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందాల రాక్ష‌సి సినిమా వీరికి గుర్తింపును అన్నా తెచ్చింది. కానీ ఈ సినిమా ఇప్పుడు వారికి ఉన్న గుర్తింపును కూడా చెడగొట్టినట్ల‌య్యింది. ఓ మంచి కాన్సెఫ్ట్‌కు వ‌ర‌స్ట్ అవుట్ ఫుట్ ఇచ్చిన సినిమాగా ఈ సినిమా మంచి ఎగ్జాంపుల్‌. ఈ సినిమా ఫెయిల్యూర్‌కు డైరెక్ట‌ర్ జ‌గ‌దీష్ త‌ల‌శిల‌దే బాధ్య‌త‌.
పంచ్‌: ఈ ల‌చ్చిందేవి తెప్పించే త‌ల‌నొప్పికి ఓ లెక్కంటూలేదు
ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది మూవీ డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ రేటింగ్‌: 2

No comments:

Post a Comment