పురాణాలు.. కొంతమంది ఇవి జరిగాయని విశ్వసిస్తుంటారు.. మరికొందరు ఇవి జరగలేదని
కొట్టిపారేస్తుంటారు. అసలు జరిగాయో లేదో తెలియని వాటిపై కేసులు వేస్తే ఎలా ఉంటుంది? వాటి మీద ఎలా వాదిస్తారు? ఎవరు వాదిస్తారు? ఇటీవల విడుదలయిన ఒక సినిమాలో హీరో.. దేవుడిపైనే కేసు వేసినట్టు బిహార్‌కు చెందిన ఒక లాయర్ కేసు వేశాడు. ఇంతకీ ఎవరిపై కేసు వేశాడని అడగరే.. శ్రీరాముడి మీద! మరి ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా… సీతమ్మ పట్ల ఆయన వ్యవహరించిన తీరు బాలేదట. ఏంటి వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! అసలు ఈ కేసు విషయమేంటో తెలుసుకుందాం..
రామాయణం ప్రకారం… రజకలి నిందకు తన భార్య సీతను రాముడు అడవుల్లో వదిలేశాడు. తరువాత సీత అడవిలో ఒక ముని ఆశ్రమంలో చేరి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ఆ తరువాత వారు తండ్రి శ్రీరాముడిని కలుసుకోవడం… సీత తన తల్లి అయిన భూమాత దగ్గరకి వెళ్లడం… ఇదంతా మనకు తెలిసిన కథ. ఇదంతా త్రేతాయుగంలో జరిగిందని పురాణేతిహాసాలు చెబుతుంటాయి. త్రేతాయుగం అంటే ఎప్పుడు అనే స్పష్టమైన అంచనా వేయడానికి కావాల్సిన సరైన కొలమానాలు లేవు. అంతేకాదు, రాముడు, సీత కల్పిత పాత్రలు అనేవారూ ఉన్నారు.
ఏదేమైనా నాడు శ్రీరామచంద్రుడు సీత పట్ల ఎలా వ్యహరించాడు అని చెప్పడానికి కావాల్సిన ఆధారాల సేకరణ కూడా నేడు సాధ్యం కాని పని. కానీ సీతను వదిలేయడంపై మనస్థాపం చెందాడు బీహార్‌కు చెందిన ఒక లాయర్ ఠాకూర్ చందన్ కుమార్. అందుకే కోర్టులో కేసు వేసేశాడు. ఠాకూర్ వేసిన ఈ కేసును ఏ విధంగా స్వీకరించాలన్న దానిపై కోర్టు చాలాసేపు ఆలోచించింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలేంటి అంటూ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఆయన కూడా ఏవో చెప్పారు. మొత్తానికి ఠాకూర్ వాదనతో సంతృప్తి చెందని న్యాయస్థానం చివరికి కేసును కొట్టేసింది. దేశంలో ఎన్నో సమస్యలుండగా.. అలాంటి విషయాల్లో కేసులు వేసి వాదిస్తే బాగుంటుందని, అంతేగాని ఇటువంటి వాటిపై కేసు వేస్తే ఏం ప్రయోజనమని కొందరు ప్రశ్నిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇటువంటివని విమర్శిస్తున్నారు.
No comments:
Post a Comment