ప్రేమ చాలా రకాలు.ముద్దుకు మల్లే.. ఇప్పించుకున్న ముద్దు.. ఇచ్చిపుచ్చుకున్న
ముద్దులానే.. అసలు ముద్దు..కొసరు ముద్దులానే.. “పెట్ ” ప్రేమ..పెట్ట ప్రేమ.. పుంజు ప్రేమ (అంటే పందాల వేళ.. గోదారి జిల్లాల్లో కనిపించేది లేండి!).. నంజు ప్రేమ. తెచ్చిపెట్టుకున్న ప్రేమ ..పంచి ఇవ్వాలనుకున్న ప్రేమ.ఘాటు ప్రేమ.. నాటు ప్రేమ ఇలా.. చెప్పుకుంటూ పోతే ప్రేమ గారి ఫ్రేములెన్నో.. ఫెయిల్యూర్లూ అన్నే! అందులో ఒక ఫ్రేము మీకోసమ్..చదవండిక.
ఇప్పుడు కాదు కానీ.. చాలా కాలం కిందట విడుదలైన ఓ సినిమాలో.. వై.విజయ ఇలా అంటుంది.నేను కుక్కను ఉంచుకున్నాను.. అని.ఆమె గారికి తెలుగు రాక అలా అనడంతో అంతా గొల్లుమన్నారు.ఇది విని అదే సీన్‌లో ఉన్న రైటర్ రావికొండల రావు ఉంచుకున్నాను కాదు మేడమ్ పెంచుకున్నాను అనాలి.అలా అంటే లోకం మిమ్మల్ని అపార్థం చేసుకుంటుందని చెబుతూ..వెనువెంటనే సవరిస్తారాయన.కానీ.. ఇప్పుడు ఓ కేరళ కుట్టి.. ఎక్కడా లేని విధంగా.. ఎన్నడూ లేని చందంగా..వివాదానికి తెరలేపింది.బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను ఏడాది కిందట మనువాడిన ఈ అమ్మడు అత్తారింటికి వస్తూ..వస్తూ.. తనతో పాటు లాబ్రడార్ జాతికి చెందిన రెండు పెంపుడు శునకాలను తీసుకువచ్చింది.అక్కడితో ఆగక అత్తింట్లో శునకాలతోనే ఎక్కువ సేపు గడుపుతోందట.ఇది ఎంత మాత్రం భర్తకు నచ్చలేదట.ఆఖరికి బెడ్ రూంలో కూడా శునకాలు తన పక్కనే ఉండాలని ఆమె పట్టుబట్టిందట. ఇది కాస్తా వివాదానికి తావ్విచ్చింది.పెంపుడు కుక్కలపై కోడలు పిల్ల ప్రదర్శిస్తోన్న అలవిమాలిన ప్రేమను చూసి, పరిస్థితి అర్థం చేసుకుని, కాపురంలో కలహాలెందుకుని కొడుక్కి సర్దిచెప్పింది తల్లి.
ఆఫ్టర్ ఒన్ ఇయర్ .. :-
ఏడాది గడిచింది. గండం మాత్రం గడవలేదు.గట్టెక్కనూ లేదు.కోడలి పిల్ల గడ్డం పట్టుకుని అత్త బతిమలాడినా నో యూజ్. పరిస్థితిలో కించిత్ మార్పు కూడా.. రాలేదు.మొగుడు ఏమనుకుంటున్నడో అన్న బెంగ కూడా అమ్మడికి లేదు.పచ్చని సంసారంలో చిచ్చెందుకన్న ధ్యాస కూడా ఈమెకు అస్సలస్సలు లేదు.చివరకు సహనం కోల్పోయి తల్లీకొడుకులిద్దరూ బెంగుళూరులోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలు కావడంతో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కౌన్సిలింగ్ కేంద్రానికి వెళ్ళాలని అక్కడి పోలీసులు సూచించారు. తాజాగా కౌన్సిలింగ్ కేంద్రానికి దంపతులు ఇద్దరూ వెళ్ళగా.. అక్కడ కూడా తనకు భర్త కంటే పెంపుడు శునకాలు అంటేనే ఎక్కువ ప్రేమని, మక్కువని ఆ.. మహాతల్లి తేల్చేసింది.భర్తకు విడాకులైనా ఇస్తా కానీ పెంపుడు శునకాలను వదిలేది లేదని తెగేసి చెప్పింది.ఇక చేసేదేముంది.. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు.న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.విడ్డూరమే కదూ! ఏంటో ఈ ఉదయం అన్నీ..అన్నీ.. విడ్డూరాలే.. అని అనిపిస్తోంది కదూ! పూణేలో ఉల్లిమండీకి సెక్యూరిటీ.. బెంగళూరులో.. పెంపుడు కుక్కలపై ప్రేమతో విడిపోయేందుకు సైతం ఓ అమ్మడు రెడీ..! ఇలా చెప్పుకుంటే పోతే.. ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..ఎవరినో ఒకరిని.. కొడుతున్నారు ఢీ.
No comments:
Post a Comment