`సినిమాల ప్రభావం జనాలపై ఎలా ఉందో తెలీదుగాని.. పంచ్ డైలాగుల ప్రభావం చాలా ఉంది`.. ఇది
ఈ మధ్య వచ్చిన సినిమాలో ఫేమస్ డైలాగ్! పంచ్ డైలాగులు ఎలా ఉన్నా.. సినిమాల ప్రభావం జనాలపై బాగా పడింది. ముఖ్యంగా నేరాల విషయంలో ఇది మరింత స్పష్టమవుతుంది. ఎందుకంటే.. సినిమా ఫక్కీలో దొంగతనాలు, అత్యాచారాలు, నేరాలకు పాల్పడటం వంటి సంఘటనలు ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోలేని సంఘటన బీహార్‌లోని పాట్నాలో జరిగింది. ఇటీవల వెంకటేశ్ హీరోగా నటించిన `దృశ్యం` సినిమా గుర్తుంది కదా! దానిని బాలీవుడ్‌లోనూ తీశారు. ఈ సినిమాలో హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఎటువంటి ప్లాన్‌లు వేశాడో.. సేమ్ టు సేమ్ అందులో వాటినే ఫాలో అయిపోయాడో యువకుడు. కానీ చివరికి అందరు నేరస్తుల లాగే చట్టానికి దొరికిపోయాడు.
పాట్నాలోని వైశాలి ప్రాంతానికి చెందిన రజనీష్ సింగ్ ను వారం క్రితం జరిగిన సృష్టీ జైన్ అనే మహిళ హత్య కేసులో అరెస్టు చేశారు. విచారణలో రజనీష్ వెల్లడించిన నిజాలు పోలీసులను అబ్బురపరుస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పిలిపించి ఆమెను కాల్చి చంపిన రజనీష్ ఆధారాలను ధ్వంసం చేయడానికి `దృశ్యం` సినిమాను అనుకరించాడు. తన మొబైల్ ఫోన్ ను ట్రాక్ చేసి పోలీసులు పట్టుకునే అవకాశం ఉందని భావించి దానిని ఓ ట్రక్కులోకి విసిరేశాడు. అయితే ఆ మొబైల్ ట్రక్కులో వేయగానే పగిలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
అలాగే తన మోటార్ సైకిల్ ను సైతం గంగా నదిలో పడేశాడు. ఇందుకోసం రూ 500 చెల్లించి ఓ బోట్ ను మాట్లాడుకొని వెళ్లి మరీ నదిలో బైక్ ను పడేసినట్లు అధికారులు వెల్లడించారు. అతడికి అంతకు ముందే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ మ్యాట్రీమోని సైట్ ద్వారా సృష్టి జైన్ ను తనకు వివాహం కానట్లు నమ్మించి పాట్నాకు రప్పించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరి సినిమాలు చూసి మంచి నేర్చుకోవడం కన్నా.. ఇటువంటి నేరాలను మాత్రం సులువుగా నేర్చేసుకుంటున్నారు.
No comments:
Post a Comment