Monday 8 February 2016

మ‌హా స‌భ‌ల ఏర్పాట్ల‌కు శ్రీ‌కారం

ngo1



శ్రీకాకుళం:మ‌హా సంరంభానికి తెర‌లేచింది. ఈ నెల 12,13 తేదీల్లో ఎచ్చెర్ల శివానీ కాలేజీ ప్రాంగ‌ణంలో జ‌రిగే ఏపీ ఎన్జీఓ మ‌హాస‌భ‌ల‌కు ఏర్పాట్లు ముమ్మ‌రమ య్యాయి. ఇందులో భాగంగా శ‌నివారం ఉద‌యం శివానీ సంస్థ‌ల అధినేత దుప్ప‌ల వెంక‌ట్రావు ప‌నులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సంఘ జిల్లా అధ్య‌క్షుడు హ‌నుమంతు సాయిరాం మాట్లాడుతూ.. ఇప్ప‌టికే స‌భా ప్రాంగ‌ణానికి సంబంధించి న‌మూనాను రూపొందించామ‌ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాక దృష్ట్యా ఎక్క‌డా ఎటువంటి ఇబ్బందీ త‌లెత్త‌కుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌ను, పొందూరు నేత కార్మికుల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా డ్వాక్రా, ఖాదీ, గిరిజ‌న ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ప్ర‌త్యేక స్టాళ్ల‌ను ఏర్పాటుచేస్తున్నామ‌ని అన్నారు. స‌భ ప్రారంభానికి ముందు జాతీయ ప‌తాకంతో పాటు, ఎన్జీఓ ప‌తాక ఆవిష్క‌ర‌ణ ఉంటుంద‌ని పేర్కొన్నారు. అదేవిధంగా స‌భ‌కు హాజ‌ర‌య్యే ఉద్యోగుల‌కు భోజ‌న వ‌స‌తి క‌ల్పించేందుకు ప్ర‌త్యేక స్టాళ్ల‌ను ఏర్పాటుచేశామ‌న్నారు. వేదిక నిర్మాణానికి సంబంధించి త‌మ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌రుచూరి అశోక్ బాబు కొన్ని సూచ‌న‌లు చేశార‌ని, వాటికి అనుగుణంగా సంబంధిత ప‌నులు ముమ్మ‌రం చేస్తున్నామన్నారు.
ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా సైకత శిల్పం
స‌భా ప్రాంగ‌ణంలో 10 ఇంటూ 10 విస్తీర్ణంలో ఎల్‌.ఎన్‌.పేట కు చెందిన క‌ళాకారుడు తరుణీ మిశ్రో నేతృత్వంలో ఎన్జీఓ సంఘం లోగోతో కూడిన ప్ర‌త్యేకంగా సైక‌త శిల్పాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ప్ర‌తిభావంతుడైన క‌ళాకారుడ్ని ప్రోత్స‌హించే దిశ‌గా తామీ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా కార్య‌ద‌ర్శి ఆర్‌.వి.ఎన్‌.శ‌ర్మ తెలిపారు. కార్యక్ర‌మంలో ఎన్జీఓ సంఘ ప‌ట్ట‌ణ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ఎల్‌.జ‌గ‌న్మోహ‌న్ రావు, ఆర్‌.వేణుగోపాల్‌, జిల్లా కార్య‌వ‌ర్గ ప్ర‌తినిధులు బి.హ‌రికృష్ణ‌, కె.శ్రీ‌నివాస్‌, శివానీ విద్యాసంస్థ‌ల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ ప్ర‌సాద్ పాల్గొన్నారు.
శ్రీ చ‌క్ర పీఠంలో ప్ర‌త్యేక పూజ‌లు
జిల్లాలో తొలిసారి గా త‌ల‌పెడుతున్న మ‌హాస‌భ‌లు విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటూ కుంచాల- కుర్మ‌య్యపేట (ఎచ్చెర్ల‌)లో ఉన్న శ్రీ చ‌క్ర‌పీఠం లో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌రుచూరి అశోక్ బాబు శ‌నివారం ఉద‌యం ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆయ‌న‌ను వేద పండితులు ఆశీర్వ‌దించి, ప్ర‌సాదం అంద‌జేశారు. తొలుత అశోక్ బాబు పీఠం నిర్వాహ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న వెంట ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర స‌హాధ్య‌క్షులు చౌద‌రి పురుషోత్తం నాయుడు, జిల్లా కార్య‌వ‌ర్గ ప్ర‌తినిధులు ఉన్నారు.
ముగిసిన రెండు రోజుల ప‌ర్య‌ట‌న
ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్య‌క్ష్యుడు ప‌రుచూరి అశోక్ బాబు రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న శ‌నివారంతో ముగిసింది. మ‌హాస‌భ‌ల ఏర్పాట్ల‌కు సంబంధించి జిల్లా కార్య‌వ‌ర్గానికి అనేకానేక సూచ‌న‌లు చేశారు. స‌భ‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను తీసుకున్న జిల్లా కార్య‌వ‌ర్గాన్ని మ‌న‌స్ఫూర్తిగా అభినందించారు. అనంత‌రం ఆయ‌న రోడ్డు మార్గంలో విశాఖ చేరుకున్నారు.

No comments:

Post a Comment