Thursday 28 January 2016

ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం.. అదీ ఇంటర్య్వూ లేకుండా

అందరికీ కాదండోయ్‌! 



చెన్నై : ఈ కాలంలో పరీక్షలు, ఇంటర్య్వూలులాంటి జంఝాటాలు లేకుండా ఉద్యోగాలు రావడం అంటే మామూలు విషయం కాదు. అదీ భారత్‌లో బాగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్‌ లాంటి సంస్థల్లో అయితే మరీనూ. కాని ఫ్లిప్‌కార్ట్‌ అలా ఇంటర్య్వూలు లేకుండా ఉద్యోగుల్ని తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ వివరాలేంటో చూసేయండి మరి.
తమ సంస్థలో ఉద్యోగుల్ని తీసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ఉడాసిటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉడాసిటీ అనేది ఒక ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సంస్థ. పలు ఆన్‌లైన్‌ కోర్సులకు సంబంధించి నానో డిగ్రీ పట్టాలిస్తుంది. ఆ సంస్థ ద్వారా వచ్చే గ్రాడ్యుయేట్లకు ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగాలివ్వనుంది. ఫ్లిప్‌కార్ట్‌ గురువారం ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అభ్యర్థికి ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు ఉంటే చాలని అలాంటి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పింది.
‘ఆ సంస్థ ద్వారా మేము ఉద్యోగంలోకి తీసుకునే వారికి ఇంటర్య్వూలు, గ్రూప్‌ డిస్కషన్‌లు ఏమీ ఉండవు. మా మొబైల్‌ డెవలప్‌మెంట్‌ టీంలోకి ఇప్పటికే అలా ముగ్గుర్ని తీసుకున్నాం. దీన్ని కొనసాగిస్తాం. భారతీయ వినియోగదారుల సమస్యల్ని పరిష్కరించే ప్రతిభావంతులకి ఫ్లిప్‌కార్ట్‌ ఎప్పుడూ అవకాశం ఇచ్చేందుకు ముందుంటుంది. కేవలం ఇంటర్య్వూలో ఒక్క రోజు చూపించే ప్రతిభ ఆధారంగా అభ్యర్థి నైపుణ్యాన్ని అంచనా వెయ్యలేం. అందుకే ఉడాసిటీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పీయుష్‌ రంజన్‌ తెలిపారు.

No comments:

Post a Comment